andrapredesh

Rs. 7 crore fraud in the name of jobs! Second accused falls into CID net

Rs. 7 crore fraud in the name of jobs! Second accused falls into CID net

By ·

Share this article
Rs. 7 crore fraud in the name of jobs!  Second accused falls into CID net

 

 

ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్ల మోసం!
 

సీఐడీ వలలో రెండో నిందితుడు


టీమీడియా , నవంబర్ 19, అమరావతి బ్యూరో :ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ.7 కోట్లు వసూలు చేసిన మోసం కేసులో సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న నిమ్మకాయల పెద్దిరాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితురాలు ధరణికృష్ణ ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని సీఐడీ ఏఎస్పీ సీతారామయ్య వెల్లడించారు.

36 మంది నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్లు
పోలీసు, దేవాదాయ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 36 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.7 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ధరణికృష్ణ ఆచూకీ తెలిసిన వారు గుంటూరు సీఐడీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

వీడియోతో బయటపడిన మోసపూరిత హామీలు
అభ్యర్థులను నమ్మించేందుకు ధరణికృష్ణ చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట అభ్యర్థులతో ఆమె మాట్లాడిన దృశ్యాలను ఓ బాధితుడు రికార్డు చేశారు.

ఏపీపీఎస్సీలో కమిషనర్ మారడం, డిప్యూటీ కమిషనర్ రావడంతో ఉద్యోగాల ప్రక్రియ ఆలస్యమైందని ఆమె చెప్పినట్లు వీడియోలో ఉంది. ఏపీపీఎస్సీ డేటాబేస్‌లో హాల్‌టికెట్ వివరాలు మార్చే ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే సంతకాలు పూర్తిచేసి జాయినింగ్ ఆర్డర్లు ఇస్తారని అభ్యర్థులను నమ్మించినట్లు తెలుస్తోంది.

రూ.22 లక్షలు వసూలు.. వాట్సాప్ చాటింగ్ కీలకం
దేవాదాయశాఖలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.22 లక్షల చొప్పున వసూలు చేసినట్లు వాట్సాప్ చాటింగ్‌ల ద్వారా వెల్లడైంది. 11 నెలల క్రితం ఇచ్చిన రూ.22 లక్షలకు వడ్డీ, ఫైల్ ప్రాసెసింగ్ ఫీజుతో కలిపి మొత్తం రూ.26.97 లక్షలు తిరిగి ఇవ్వాలని ఓ బాధితుడు సందేశం పంపినట్లు సమాచారం.

దీనికి ధరణికృష్ణ స్పందిస్తూ తనకు కేవలం రూ.7 లక్షలే అందాయని, మిగిలిన మొత్తంతో తనకు సంబంధం లేదని చెప్పినట్లు చాటింగ్‌లో ఉంది.

సీఐడీ దర్యాప్తు ముమ్మరం
వీడియోలు, వాట్సాప్ సందేశాలను కీలక ఆధారాలుగా సేకరించిన సీఐడీ అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఉద్యోగాల కోసం అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఇలాంటి మోసాలపై నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Tags: