ఎగ్జిబిషన్ హక్కులకు లెక్కేది?
బహిరంగ వేలం లేకుండానే నిర్వహణకు అనుమతులా?
దేవాదాయ శాఖకు రావాల్సిన ఆదాయానికి గండి పడిందా?
రసీదు,అనుమతుల పత్రాలు బయటపెట్టాలని డిమాండ్
ఈఓ వివరణతో మరిన్ని ప్రశ్నలు!
టీ మీడియా,అక్టోబర్23,సింగరేణి(కారేపల్లి): ఖమ్మం జిల్లా సింగరేణి మండలం శ్రీ శ్రీ శ్రీ కోట మైసమ్మ జాతరలో ఎగ్జిబిషన్,జాయింట్ వీల్స్ నిర్వహణ వ్యవహారం ఇప్పుడు దేవాదాయ శాఖ అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి రూ.లక్ష విరాళంగా తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి కే. వెంకటయ్య వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అయితే రూ.లక్ష విరాళం తీసుకోవడం వరకు సరే.. ఎగ్జిబిషన్ నిర్వహణ హక్కులు ఎవరికి, ఏ విధానంలో ఇచ్చారు?బహిరంగ వేలం నిర్వహించారా? లేదా?అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా నిలుస్తోంది.ఆలయ జాతర ప్రాంగణంలో వ్యాపార,వినోద కార్యక్రమాల నిర్వహణకు అవకాశం కల్పించినప్పుడు దేవాదాయ శాఖకు ఆదాయం సమకూరే విధంగా నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందా?అలాంటప్పుడు ఎగ్జిబిషన్ విషయంలో ఏ విధానం అనుసరించారు? పోటీ పద్ధతిలో అవకాశమిస్తే రూ.లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఆలయానికి వచ్చేదా? వేలం నిర్వహించకుండా కేవలం ‘విరాళం’తో సరిపెట్టుకున్నట్లయితే ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి పడిందా? అనే సందేహాలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
*విరాళం వేరు.. నిర్వహణ హక్కులు వేరు కాదా?*
భక్తులు, దాతల నుంచి ఆలయానికి విరాళాలు స్వీకరించడం ఒక అంశం.జాతరలో ఎగ్జిబిషన్,వినోద పరికరాల నిర్వహణకు స్థలం లేదా హక్కులు కల్పించడం మరో అంశం. మరి ఈ రెండింటినీ ఒకే గాటన కట్టారా? రూ.లక్ష విరాళం ఇచ్చారనే కారణంతోనే ఎగ్జిబిషన్‌కు అవకాశం కల్పించారా? లేక ఇందుకు ప్రత్యేకంగా అధికారిక అనుమతి ప్రక్రియ జరిగిందా? అన్నది దేవాదాయ శాఖ స్పష్టం చేయాలి.రూ.లక్షకు ఆలయం నుంచి అధికారిక రసీదు ఇచ్చారా? ఆ మొత్తం ఏ తేదీన స్వీకరించారు? ఆలయ అధికారిక ఖాతాలో జమ చేశారా? ఎగ్జిబిషన్‌కు స్థలం కేటాయిస్తూ ఏదైనా ఉత్తర్వు ఇచ్చారా? సంబంధిత శాఖల అనుమతులు తీసుకున్నారా? ఈ పత్రాలను బహిర్గతం చేస్తేనే ఈ వ్యవహారంపై నెలకొన్న సందేహాలకు తెరపడుతుంది.

*వేలం పెడితే ఆలయానికి ఎంత వచ్చేది?*
జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఎగ్జిబిషన్, జాయింట్ వీల్స్ వంటి వినోద కార్యక్రమాలకు వాణిజ్యపరమైన ఆదాయ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో బహిరంగ వేలం నిర్వహించి ఉంటే ఎంతమంది పోటీ పడేవారు? ఆలయానికి ఎంత ఆదాయం వచ్చేది? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. వేలం నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిర్వహించకపోతే అందుకు బాధ్యులెవరు? ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారా? అనే అంశాలపై సమగ్ర వివరణ అవసరం.ఇప్పటికే జాతరలో పారిశుధ్యం, మరుగుదొడ్లు, వాహన పూజల వసూళ్లు తదితర అంశాలపై విమర్శలు వినిపిస్తున్న తరుణంలో ఎగ్జిబిషన్ వ్యవహారం మరో వివాదానికి దారితీస్తోంది.
“రూ.లక్ష విరాళం తీసుకున్నాం” అనే ఒక్క వివరణతో సరిపెట్టకుండా, వేలం నిర్వహించారా లేదా? నిర్వహణ హక్కులు ఎలా కేటాయించారు? ఏయే అనుమతులు ఇచ్చారు? అనే పూర్తి వివరాలను దేవాదాయ శాఖ వెల్లడించాల్సిన అవసరం ఉంది.ఆలయ ఆదాయాన్ని కాపాడాల్సిన దేవాదాయ శాఖే బహిరంగ వేలం నిర్వహించకుండా విరాళంతో సరిపెట్టుకుందా?నిబంధనలకు అనుగుణంగానే మొత్తం ప్రక్రియ జరిగిందా? అన్నది ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది.సంబంధిత రికార్డులు,రసీదులు,అనుమతుల పత్రాలను బయటపెట్టి భక్తుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపై ఉంది.






