లైంగిక వేధింపులు భరించలేకే హత్య
శివసత్తు సుధాకర్ స్వామి కేసులో కొత్త కోణం
టీ మీడియా, నవంబరు 4, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో శివసత్తు హత్య కేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శివసత్తు సుధాకర్ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడిని తరచూ లైంగికంగా వేధించేవాడని తేలింది. అది భరించలేకే ఆ యువకుడు తన స్నేహితుడి సాయంతో హత్యకు పాల్పడినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు.
పూజలు, కొలుపులు చెప్తూ జీవనం
రాళ్లబండి సుధాకర్ స్వామి చౌటుప్పల్‌లో నివాసం ఉండేవారు. అతను శివసత్తుగా ఉంటూ దేవుడి పండుగలు, కొలుపులు చెప్పి వ్యక్తిగత పూజలు చేసేవాడు. వీటికి రూ.1 నుంచి రూ.3 లక్షల వరకు తీసుకునేవాడు. అతనికి వివాహం కాలేదు. కానీ ఓ కుమారుడిని దత్తత తీసుకున్నాడు. ఆ కుమారుడు ఇప్పుడు హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. కాగా సుధాకర్ స్వామి ఆర్థిక వ్యవహారాలన్నీ మేనల్లుడు సురేశ్ చూసుకుంటున్నాడు. కామాఖ్య అమ్మవారి దర్శనం కోసం సుధాకర్ అస్సాంలోని దేవాలయానికి తరచూ వెళ్తుండే వాడు. రెండేళ్ల క్రితం అక్కడికి వెళ్లాడు. అప్పుడు మధ్యప్రదేశ్‌లోని సోలంగ్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (21) సుధాకర్‌కు పరిచయమయ్యాడు.
వీడియో బయటపెడతానని బెదిరింపులు
ఆ పరిచయం లైంగిక సంబంధానికి దారి తీసింది. వారిద్దరూ రెండు నెలల క్రితం కలిసిన దృశ్యాలను సుధాకర్ స్వామి తన ఫోన్లో రికార్డు చేశాడు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని తనను కలిసేందుకు తరచూ రావాలని, లేదంటే ఆ దృశ్యాలను బయటపెడతానని సుధాకర్ స్వామి పవన్‌ను బెదిరింపులకు గురి చేశాడు. ఆ వేధింపులను పవన్‌కుమార్ తట్టుకోలేకపోయాడు. కాగా గత నెలలో సురేశ్‌కు పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో సుధాకర్ స్వామి కిలోకు పైగా బంగారు ఆభరణాలను ధరించాడు. ఆ వివాహానికి హాజరైన పవన్, ఆ ఆభరణాలపై కన్నేసి అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
స్నేహితుడు హర్ష్ సంతోష్‌తో కలిసి
సుధాకర్ స్వామిని అడ్డు తప్పిస్తే తనకు బంగారం దక్కడంతో పాటు వేధింపులు కూడా ఆగిపోతాయని పవన్ అనుకున్నాడు. వెంటనే స్నేహితుడు హర్ష్ సంతోశ్ పాండేను సహాయం కోరాడు. అతను దీనికి ఒప్పుకోవడంతో ఇద్దరూ రైలులో చౌటుప్పల్‌కు వచ్చారు. శనివారం రాత్రి సుధాకర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. పథకం ప్రకారం వారు సుధాకర్ కాళ్లు, చేతులను కట్టేసి కత్తులతో పొడిచి చంపేశారు. తర్వాత 1.319 కిలోల బంగారం, 3.6 కిలోల వెండి, అలాగే రూ.9.03 లక్షల నగదు, ఓ ఐ ఫోన్‌ను తీసుకుని సుధాకర్ కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు.
ఫాస్టాగ్ సందేశాల ఆధారంతో
మేనల్లుడు సురేశ్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అయితే నిందితులిద్దరూ నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్-44)పై వెళ్తున్నట్టు సురేశ్ ఫోన్‌కు ఫాస్టాగ్ సందేశాలు వచ్చాయి. పోలీసులు వెంటనే టోల్‌ప్లాజా అధికారులను, అలాగే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.
నిర్మల్ జిల్లా గంజాల్ టోల్‌ప్లాజా వద్ద నిందితుల కారును అడ్డగించారు. అయినా వారు ఆపకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు కారు అద్దాలపై కర్రలతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నిర్మల్ జిల్లా కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు. చౌటుప్పల్ కోర్టులో న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. దీంతో నిందితులను నల్గొండ జైలుకు తరలించారు.

![A dispute over one and a half acres of land... Brutally [attacked/harmed] his younger brother's wife... A dispute over one and a half acres of land... Brutally [attacked/harmed] his younger brother's wife...](https://tmedia.net.in/uploads/posts/20261104-161016-6ac851ef.jpg)




