Hyderabad

Flaws in the 'Bhu Bharati' system: Tenant farmers face credit woes!

Flaws in the 'Bhu Bharati' system: Tenant farmers face credit woes!

By ·

Share this article
Flaws in the 'Bhu Bharati' system:  Tenant farmers face credit woes!

 

 

భూ భారతి లోపాలతో                                                                                     

కౌలు రైతులకు రుణ కష్టాలు!


 టీమీడియా , నవంబర్ 20,  హైదరాబాద్​  బ్యూరో : కౌలు రైతులకు పంట రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. భూమిని సాగు చేస్తున్నది ఒకరు.. భూ రికార్డుల్లో యజమానిగా నమోదైంది మరొకరు కావడంతో కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందడం గగనంగా మారుతోంది. ముఖ్యంగా భూ భారతి పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలు కౌలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. సాగు చేస్తున్న భూమి విస్తీర్ణాన్ని అధికారికంగా నిర్ధారించే వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో బ్యాంకులు రుణాల మంజూరుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. అవసరమైన సదుపాయాలు కల్పిస్తే కౌలు రైతులకు ఏడు శాతం వడ్డీతో పంట రుణాలు అందించే అవకాశం ఉంది.

భూ వివరాల కొరతతో రుణాలకు బ్రేక్‌!
కౌలుకు తీసుకున్న భూమి వివరాలు, విస్తీర్ణం, భూ యజమాని వివరాలను ధ్రువీకరించడంలో బ్యాంకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాము ఏ రైతు దగ్గర ఎంత భూమిని కౌలుకు తీసుకున్నామో కౌలు రైతులు చెబుతున్నప్పటికీ, వాటిని అధికారికంగా నిర్ధారించే ఆధారాలు లేకపోవడంతో రుణాలు మంజూరు కావడం లేదు. ఫలితంగా తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు పొందలేక కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఏడాదికి 24 నుంచి 60 శాతం వరకు అధిక వడ్డీ చెల్లిస్తూ అప్పులు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు మరింత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారు.

సంఘాల ఏర్పాటులోనూ నిర్లక్ష్యం!
కౌలు రైతులు సంఘాలుగా ఏర్పడితే ఆ సంఘాల పేరిట పంట రుణాలు అందించే నిబంధనలు ఉన్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. గ్రామస్థాయిలో అధికారులు కౌలు రైతులను సంఘాలుగా ఏర్పాటు చేయడంలో చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. రుణాల కోసం అవసరమైన మార్గదర్శకాలు, సహకారం అందకపోవడంతో ఈ అవకాశం కూడా వారికి అందుబాటులోకి రావడం లేదు. భూ భారతి పోర్టల్‌లో పట్టాదారు పాస్‌పుస్తకం లేకున్నా కొన్ని సందర్భాల్లో పంట రుణాల వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, కౌలు రైతులకు అవసరమైన విధానం అందుబాటులో లేదు. రుణాల నమోదు, భూమి సాగు విస్తీర్ణం ధ్రువీకరణకు ప్రత్యేక విధానాన్ని రూపొందించి, స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వరి బోనస్‌కూ దూరమే!
కౌలు రైతులకు సాగు ప్రారంభం నుంచి పంట విక్రయం వరకు అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. ప్రధాన పంట అయిన వరి సాగులో యూరియా, ఇతర ఎరువులు పొందాలన్నా భూ యజమాని ఫోన్‌ నంబరు, ఓటీపీ అవసరం కావడంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత విక్రయించే సమయంలోనూ ప్రభుత్వం ప్రకటించే బోనస్‌ పొందాలంటే పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాల్సి వస్తోంది. భూమిపై హక్కు లేకపోవడంతో అవసరమైన పత్రాలు సమకూర్చుకోలేక చాలామంది కౌలు రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు.

ప్రభుత్వమే పరిష్కారం చూపాలి!
ఏటా పెరుగుతున్న కౌలు ధరలు, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు రైతులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. సాగు చేసే రైతుకు గుర్తింపు లేకపోవడం, పంట రుణాలు అందకపోవడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు దక్కకపోవడం వారి పరిస్థితిని మరింత దుర్భరంగా మారుస్తోంది. భూమి యాజమాన్యంతో సంబంధం లేకుండా వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులను గుర్తించే విధానం తీసుకురావాలి. భూ భారతి పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేసి, కౌలు రైతుల సాగు విస్తీర్ణాన్ని ధ్రువీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సంఘాల ఏర్పాటు, పంట రుణాల మంజూరు, ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోలు, బోనస్‌ చెల్లింపుల్లో కౌలు రైతులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి. అప్పుడే కౌలు రైతులకు ప్రభుత్వ భరోసా నిజమైన అర్థంలో అందుతుంది.

Tags: