తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ
పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీమీడియా , నవంబర్ 20, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పోలీసు నియామక మండలి కీలక సమాచారం వెల్లడించింది. ఎస్సై ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ల విడుదల తేదీని ప్రకటించింది. నవంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి తెలిపింది.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ద్వారా నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు పొందవచ్చు. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
నవంబర్ 29న ప్రిలిమినరీ పరీక్ష
మొత్తం 275 సివిల్ ఎస్సై, సమాన స్థాయి పోస్టుల భర్తీకి నవంబర్ 29వ తేదీన ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో రాసే అవకాశం కల్పించారు. అభ్యర్థుల్లో అత్యధికంగా 56.84 శాతం మంది తెలుగును ఎంచుకోగా, 43.02 శాతం మంది ఇంగ్లీష్, 0.12 శాతం మంది ఉర్దూ మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్నారు. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్‌టికెట్లను భద్రపరచుకోవాలని మండలి సూచించింది.
ఎస్సై ఉద్యోగాల ఖాళీల వివరాలు
- ఎస్సై (సివిల్) – 148- ఎస్సై (ఆర్మ్‌డ్ రిజర్వ్) – 14- ఎస్సై (టీజీఎస్పీ) – 12- ఎస్సై (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) – 3- ఏఎస్సై (ఫింగర్ ప్రింట్ బ్యూరో) – 23
కనీస అర్హత మార్కుల్లో మార్పులు
2022 పోలీసు నియామక ప్రకటనతో పోలిస్తే ఈసారి ప్రిలిమినరీ పరీక్షలో కనీస అర్హత మార్కుల విషయంలో మార్పులు చేశారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 200 మార్కులకు గాను కనీసం 60 మార్కులు (30 శాతం) సాధించాలి. బీసీ అభ్యర్థులకు 25 శాతం అంటే 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, హోంగార్డులకు 20 శాతం అంటే 40 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు.
ఈ మార్పులు ఆయా వర్గాల అభ్యర్థులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లలో పేర్కొన్న పరీక్ష కేంద్రం, సమయం, ఇతర సూచనలను ముందుగానే పరిశీలించుకోవాలి.






