ఖరీఫ్ రైతులకు ఊరట..
ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు
కేంద్రం ముందస్తు కార్యాచరణ!
టీమీడియా , నవంబర్ 20, హైదరాబాద్ బ్యూరో : ఎల్‌నినో ప్రభావంతో రానున్న వర్షాకాలంలో వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందన్న అంచనాలు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోతే ఖరీఫ్ సాగు దెబ్బతినడంతో పాటు రైతుల పెట్టుబడులు, ఆదాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వాతావరణ ముప్పు నుంచి రక్షించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. కరువు పరిస్థితులు ఏర్పడిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు జాగ్రత్తలతో పంట నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది.
262 జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వర్షపాత లోటు ముప్పు ఉన్న 262 జిల్లాలను గుర్తించినట్లు సమాచారం. వర్షపాతం అంచనాలు, నీటిపారుదల సదుపాయాలు, సాగు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ జిల్లాలను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.
విత్తనాల కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు
వర్షాలు ఆలస్యమైనా, సాధారణం కంటే తక్కువగా కురిసినా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా అదనపు విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. జిల్లా స్థాయిలో వ్యవసాయ అత్యవసర ప్రణాళికలను రూపొందించి రైతులకు అందించనున్నారు. వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, విత్తనాలు వేసే సమయం, సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖ సూచనలు ఇవ్వనుంది.
ప్రతి నీటి చుక్కా కీలకమే!
వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు అవసరమైన రాయితీలు, అవగాహన కార్యక్రమాలను విస్తరించనున్నారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ప్రత్యామ్నాయ సాగు విధానాలపై రైతులకు మార్గదర్శకత్వం కల్పించనున్నారు.
పంటల బీమా.. రుణాలతో ఆర్థిక భరోసా
వాతావరణ ప్రతికూలతలతో పంటలు దెబ్బతింటే రైతులు ఆర్థికంగా కుంగిపోకుండా పంటల బీమా, వ్యవసాయ రుణాల ద్వారా భరోసా కల్పించే అంశాలపై దృష్టి సారించనున్నారు. వాతావరణ హెచ్చరికలను విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, నీటి నిర్వహణతో అనుసంధానించి రైతులకు సకాలంలో సమాచారం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అమలులోనే అసలు సవాల్!
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కేంద్రం రూపొందిస్తున్న ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ఆశాజనకమే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కీలకం. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు సకాలంలో అందాలి. వ్యవసాయ అధికారుల సూచనలు గ్రామస్థాయికి చేరాలి. పంటల బీమా పరిహారం, రుణ సదుపాయాలు రైతులకు నిజంగా అందుబాటులోకి రావాలి. అప్పుడే ఈ ముందస్తు ప్రణాళిక రైతాంగానికి వాస్తవమైన రక్షణగా నిలుస్తుంది. లేకపోతే ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.






