దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో మెగా రక్తదాన శిబిరం
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదానం.. 62 యూనిట్ల రక్తం సేకరణ
టీ మీడియా,అక్టోబర్ 30,దమ్మపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పాల్వంచ సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి సూచనలతో అశ్వారావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరం ద్వారా మొత్తం 62 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దమ్మపేట ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భవాని, అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ, వివిధ గ్రామాల సర్పంచులు హాజరయ్యారు. అలాగే దమ్మపేట, అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, యువత సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు రక్తదానంపై అవగాహన కల్పించారు.







